

నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర భయాందోళన నెలకొంది. ఉదయం 4.40 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి రిజర్వాయర్ ఔట్‌ఫాల్ రెగ్యులేటర్‌కు ఉన్న ఏకైక గేటును ఎత్తినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో రిజర్వాయర్‌లో సుమారు 9.5 టీఎంసీల నీరు ఉండగా, గేటు నుంచి 3,000 క్యూసెక్కులకు పైగా నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో ఎస్సార్బీసీ కాలువ సామర్థ్యానికి మించి నీరు రావడంతో కాలువ పక్కన ఉన్న మట్టికట్ట పలు చోట్ల కొట్టుకుపోయింది. బండరాళ్లు, మట్టి నీటితో కలిసి రోడ్లు, పొలాల్లోకి చేరాయి. రిజర్వాయర్ కట్ట తెగిపోయిందన్న భయంతో పిల్లలు, వృద్ధులు సహా సుమారు వెయ్యి మంది గ్రామస్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సెల్‌ఫోన్ లైట్ల సహాయంతో సమీపంలోని కొండపైకి పరుగులు తీశారు.
ప్రమాద పరిస్థితిని గుర్తించిన అధికారులు సమీపంలోని జయజ్యోతి సిమెంట్స్ పంపుహౌస్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్ కోటయ్యను సంప్రదించారు. విద్యుత్తు సరఫరా లేకపోయినా గేటును మాన్యువల్‌గా దించే విధానం తెలిసిన ఆయన రెగ్యులేటర్ వద్దకు వెళ్లి గేటును కిందకు దించడంతో నీటి ఉద్ధృతి అదుపులోకి వచ్చింది. అప్పటికే కాలువ కట్ట దెబ్బతినడంతోపాటు గోరుకల్లు-పాణ్యం రహదారిపై బండరాళ్లు పేరుకుపోయాయి. రిజర్వాయర్ గ్యాలరీలోని విద్యుత్ వ్యవస్థలు, స్టార్టర్ బాక్స్‌లు, మోటార్లు కూడా దెబ్బతిన్నాయి. గేటు స్విచ్‌లు రెగ్యులేటర్ పైభాగంలో ఉండటంతో ఇది ఉద్దేశపూర్వక చర్య అయి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్ రాజకుమారి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎస్ఈ ప్రతాప్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!