

తెలంగాణ విమోచన దినోత్సవం 79వ చారిత్రక వార్షికోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ, అప్పటి హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ కోసం మరికొంత కాలం పోరాటం చేయాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత సమాఖ్యలో విలీనమైన చారిత్రక పరిణామాన్ని ఆయన ప్రస్తావించారు.
నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, అకృత్యాలను గవర్నర్ గుర్తుచేసుకుంటూ ఆదివాసీలు, రైతులు, యువత, మహిళలు సహా పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పించారు. ఆధునిక భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను కృతజ్ఞతతో స్మరించుకోవాలని అన్నారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత సమాఖ్యలో అంతర్భాగంగా మారిన చారిత్రక పరిణామాన్ని ఆయన ప్రస్తావించారు.
విమోచన ఉద్యమ సమయంలో తమ పూర్వీకులు చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న కష్టాలను యువత లోతుగా అర్థం చేసుకోవాలని శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. విమోచన దినోత్సవం కేవలం చారిత్రక ఘటనను గుర్తుచేసుకునే రోజు మాత్రమే కాకుండా, ఐక్యత, ప్రజాస్వామ్య విలువలు, దేశ సమగ్రత పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించుకునే సందర్భంగా భావించాలని సూచించారు. సమర్థవంతమైన, సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!