

ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, కువైట్, ఒమన్, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. అక్కడ పనిచేస్తూ వారు స్వదేశానికి పంపే డబ్బుతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. అయితే గల్ఫ్ ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అనధికార ఏజెంట్లు నకిలీ ఉద్యోగాలు, తప్పుడు వీసాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా నిమ్మపల్లికి చెందిన ఓ వ్యక్తిని ఇజ్రాయెల్‌కు పంపిస్తానని చెప్పి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ ఏజెంట్‌పై కేసు నమోదైనట్లు సమాచారం. మరో ఘటనలో జగిత్యాల జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు మస్కట్‌లో ఉద్యోగాల కోసం ఓ ట్రావెల్ ఏజెంట్‌కు ఒక్కొక్కరు రూ.2.30 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అక్కడ హామీ ఇచ్చిన ఉద్యోగం, సరైన వసతులు లేక తిరిగి వచ్చామని, ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనాలు వస్తాయని ప్రచారం చేయడం, వర్క్ వీసా పేరుతో విజిట్ వీసాలపై పంపించడం, ఒక ఉద్యోగం అని చెప్పి విదేశాలకు వెళ్లిన తర్వాత మరో పని అప్పగించడం వంటి మోసాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. లైసెన్స్ లేని ఏజెంట్లు గల్ఫ్‌కు పంపిస్తామని డబ్బులు తీసుకుని పరారయ్యే ఘటనలు కూడా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే ముందు రిక్రూటింగ్ ఏజెంట్‌కు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉందో లేదో పరిశీలించాలి. అలాగే ఉద్యోగం ఇచ్చే సంస్థ వివరాలు, వీసా రకం, జీతం, పని, వసతి తదితర అంశాలతో కూడిన ఒప్పందాన్ని ముందుగానే పరిశీలించి భద్రపరచుకోవాలి. సబ్ ఏజెంట్లను గుడ్డిగా నమ్మకుండా, ‘100 శాతం వీసా గ్యారంటీ’ వంటి హామీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!