

న్యూయార్క్‌లోని హిక్స్‌విల్‌లో ‘హర హర మహాదేవ – శివ తత్వాలు’ కార్యక్రమం భక్తి, సంగీతాల సమ్మేళనంగా ఘనంగా జరిగింది. ఎస్‌పీబీ మ్యూజిక్ అకాడమీ (SPBMA), న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA), తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 14న ఆసామయి హిందూ టెంపుల్ అండ్ సాయి దర్బార్‌లో జరిగిన ఈ వేడుకలో శ్రీ స్వర వీణాపాణి భక్తిగీతాలు, శివతత్వ వివరణలతో ప్రేక్షకులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తారు. 72 మేళకర్త రాగాల ఆధారంగా రూపొందించిన కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన ఆయన సంగీత ప్రదర్శనతో సభికులను ఆకట్టుకున్నారు. ప్రముఖ గాయకుడు వై.ఎస్. రామకృష్ణతో పాటు ఎస్‌పీబీఎంఏ గాయకులు కుమార్ బుధరాజు, వేణు పాల్యం, శ్రీనివాస్ గూడూరు, రాజేశ్వరి బుర్రా తదితరులు భక్తిగీతాలను ఆలపించారు.
ఈ సందర్భంగా న్యూయార్క్‌లో పుట్టి పెరిగి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న యువతను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. నటనారంగంలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈశ్వర్ దొమ్మరాజు, అమిత్ అనుగు, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ TLCA సంయుక్త కార్యదర్శిగా సేవలందిస్తున్న దివ్య దొమ్మరాజును అభినందించారు. కార్యక్రమానికి సహకరించిన NYTTA, SPBMA, TTA, TLCA నాయకులు, దాతలు, కళాకారులు, స్వచ్ఛంద సేవకులను నిర్వాహకులు సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. SPBMA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కుమార్ బుధరాజు, వేణు పాల్యం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వివిధ తెలుగు సంఘాల నాయకులు, సభ్యుల సమిష్టి కృషితో కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తి, సంగీతం, ఆత్మీయ ఆతిథ్యంతో సాగిన ఈ వేడుక తెలుగు సమాజానికి మధురానుభూతిని అందించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!