

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను అధిగమిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలును ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికీ అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. నారీశక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఈ నెల 30న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ దశాబ్దాలుగా కొనసాగుతోందని మోదీ పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధన కోసం తానూ ప్రయత్నిస్తున్న వారిలో ఒకరినని తెలిపారు. ఎంతోమంది మహిళలు ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని, పలువురు సోదరీమణులు లేఖలు కూడా రాశారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా మహిళల ఆశీస్సులు తమకు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ ప్రయత్నాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేవని మోదీ స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!