

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో గ్రిడ్ స్థాయి ఇంధన నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.14,500 కోట్లతో ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా 92 గిగావాట్ అవర్ (GWh) ఇంధన నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, అభివృద్ధి చెందుతున్న నిల్వ సాంకేతికతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ పథకం 2026-27 నుంచి 2030-31 వరకు అమలుకానుంది.
దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 24 రకాల క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు రూ.2,814 కోట్ల పథకానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఖనిజాల శుద్ధి, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచి సెమీకండక్టర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలకు అవసరమైన ముడి పదార్థాల లభ్యతను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం 850 ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టుల కొనసాగింపు, విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ.3,788 కోట్లకు పైగా నిధులు కేటాయించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!