

గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో సిక్కింలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. పశ్చిమ సిక్కింలోని యుక్సోం–తషిడింగ్ పరిధిలోని రింబి గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల శిథిలాలు, బురదతో కూడిన వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరో కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజధాని గ్యాంగ్‌టక్‌లోనూ భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో రహదారులపై బురద పేరుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గ్యాంగ్‌టక్ జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రింబి గ్రామంలో ఇళ్లు దెబ్బతిన్న బాధితులను పరామర్శించిన అధికారులు, బోజోగ్‌హరి సమీపంలోని లూయింగ్–రంకా రహదారి, లింగ్‌డింగ్, హైకోర్టు రోడ్, టీఎన్‌ఏ గేట్, వీఐపీ కాలనీ, పాంగ్‌థాంగ్–లింగ్‌డాక్ రోడ్, పమ్రో గాన్, ఫెన్‌జాంగ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. వరదలు, కొండచరియల కారణంగా పశ్చిమ సిక్కింలో పలు ప్రాంతాల్లో రోడ్డు రవాణా స్తంభించిపోయింది. సిచీలోని మురుగునీటి శుద్ధి కేంద్రంతో పాటు ప్రజా మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది. రోడ్లపై పేరుకుపోయిన బురద, శిథిలాలను త్వరగా తొలగించాలని అధికారులు ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణాలను నివారించాలని ప్రజలను హెచ్చరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!