

నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం భక్తుల సందడితో కళకళలాడుతోంది. ఆలయ పరిసరాలు, ప్రధాన వీధులు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి కల్పించారు. దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రాక మరింత పెరగడంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!