

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) పేరుతో పేదలు, మైనారిటీలు, బలహీన వర్గాల ఓటు హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ల తొలగింపులు, ఎన్నికల డేటాలో మార్పులు, ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ బీజేపీ నేతలు సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని విమర్శించారు. ఓటర్ల జాబితాను మెషిన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఎందుకు అందించడం లేదని, ఫారం-6లో మార్పులు, ఓటర్ల తొలగింపులకు సంబంధించిన రికార్డులను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తప్పించారని, ఎన్నికల డేటా అందుబాటులో లేకుండా చట్ట సవరణలు ఎందుకు చేశారని నిలదీశారు. ఎస్‌ఐఆర్ అంశంపై పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చర్చించడానికి బీజేపీ ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.
కరీంనగర్ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ అభివృద్ధి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాహుల్ గాంధీని విమర్శించడానికే ప్రాధాన్యం ఇచ్చారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. చొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కాంగ్రెస్ కోరడం లేదని, అక్రమ చొరబాట్లు జరగకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు చొరబాటుదారులు ఓటర్లుగా ఎలా మారుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, రాష్ట్రానికి అందించిన నిధులపై బీజేపీ సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరచడం, దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. మతపరమైన భావోద్వేగాలు, విద్వేష రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించకుండా అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!