

మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 24న దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ శుక్రవారం (నవంబర్ 20) సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళనాడు హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
అంతకుముందు మద్రాస్ హైకోర్టు తీర్పులోని కొన్ని వ్యాఖ్యలపై స్టే విధిస్తూ, పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాదికి మాత్రమే దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించి సుప్రీంకోర్టు పలు కఠినమైన షరతులు కూడా విధించింది. సాధారణ భక్తులు, ప్రజలు, ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలకు అక్కడ అనుమతి లేదని స్పష్టం చేసింది. ఆలయ దేవస్థానం తరపున ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే దీపస్తంభం వద్దకు వెళ్లాలని ఆదేశించింది. ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను మదురై జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. అవసరమైతే భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ను కూడా మోహరించవచ్చని పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!