

జాతీయ రహదారి 65 (హైదరాబాద్-విజయవాడ హైవే) విస్తరణకు కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు 285 కిలోమీటర్ల మేర రహదారిని రూ.12,073.99 కోట్లతో ఆరు వరుసలుగా విస్తరించేందుకు పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభిస్తే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం కానుంది.
ఈ ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి విజయవాడలోని గొల్లపూడి వరకు 181 కిలోమీటర్ల మేర మొదటి ప్యాకేజీ, హైదరాబాద్ నుంచి నందిగామ వరకు 45 కిలోమీటర్ల మేర రెండో ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.69 కిలోమీటర్ల మేర మూడో ప్యాకేజీ పనులు చేపట్టనున్నారు.
హైదరాబాద్-విజయవాడ మార్గాన్ని బిల్డ్-ఆపరేట్-టోల్ (బీఓటీ) పద్ధతిలో, విజయవాడ-మచిలీపట్నం మార్గాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో అభివృద్ధి చేయనున్నారు. ప్యాకేజీ-1కు రూ.7,321.97 కోట్లు, ప్యాకేజీ-2కు రూ.2,965.11 కోట్లు, ప్యాకేజీ-3కు రూ.1,786.91 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూసేకరణ, నిర్మాణం, జీఎస్టీ తదితర ఖర్చులతో కలిపి కిలోమీటరుకు సగటున రూ.38 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉంది.
ఈ విస్తరణ తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాల మీదుగా సాగనుంది. రెండు రాష్ట్రాల్లోనూ అవసరమైన భూమిలో ఎక్కువ భాగం ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
విస్తరణ అనంతరం ఎన్‌హెచ్-65ను హైస్పీడ్ కారిడార్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఆరు వరుసల ప్రధాన రహదారితో పాటు రెండు వైపులా క్రాష్ బారియర్లు, రెండు వరుసల సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 15 నుంచి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఈ మార్గంలో ప్రయాణించిన దూరానికి అనుగుణంగా టోల్ వసూలు చేసే సాంకేతికతను తీసుకురానున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో వాహనం హైవేలోకి ప్రవేశించే సమయంలో స్కాన్ చేసి, బయటకు వెళ్లే ప్రాంతంలో ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేసే విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు. పీపీపీఏసీ ఆమోదంతో ఈ ప్రతిపాదన ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి వెళ్లనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!