

భారత వైమానిక దళం (IAF) సరికొత్త చరిత్ర సృష్టించింది. భారీ రవాణా విమానం IL-76MD (గజరాజ్) తూర్పు లడఖ్‌లోని ముధ్-న్యోమా ఎయిర్‌బేస్‌లో 13,629 అడుగుల ఎత్తులో విజయవంతంగా ల్యాండ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా IL-76 విమానం ఇంత ఎత్తులో ల్యాండ్ కావడం ఇదే తొలిసారి అని భారత వైమానిక దళం ప్రకటించింది. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో గాలి సాంద్రత తక్కువగా ఉండటంతో విమాన ఇంజిన్ల పనితీరు, రెక్కలకు లభించే లిఫ్ట్ తగ్గుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగు ఇంజిన్లు కలిగిన భారీ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం పైలట్లకు పెద్ద సవాలు. విమాన సిబ్బంది అసాధారణ నైపుణ్యం, కచ్చితత్వం, సమన్వయంతో ఈ ఘనత సాధించారు.
చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ (LAC)కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో న్యోమా ఎయిర్‌బేస్ ఉంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో ఆధునిక రన్‌వే, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. తాజాగా IL-76MD విమానం ల్యాండింగ్ కావడం వల్ల సరిహద్దు ప్రాంతాలకు సైనిక బలగాలు, భారీ వాహనాలు, ఆయుధాలు, ఇతర అత్యవసర సామగ్రిని వేగంగా తరలించే అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రహదారి మార్గాలకు అంతరాయం ఏర్పడినప్పుడు ఈ ఎయిర్‌బేస్ కీలకంగా ఉపయోగపడనుంది. ఈ విజయంతో హిమాలయాల్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ భారత వైమానిక దళం తన కార్యాచరణ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!