

రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సైలోల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ వ్యయం, నిర్వహణ విధానాలపై నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నిపుణులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ఒక్కో సైలో కేంద్రంలో లక్ష టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాలను ఏర్పాటు చేస్తే మొత్తం 10 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయవచ్చు. ధాన్యాన్ని నిల్వ చేసే ముందు శుభ్రపరిచేందుకు, ఆరబెట్టేందుకు ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా గోనె సంచుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు నిల్వ ఖర్చులను తగ్గించి, ధాన్యం నాణ్యతను కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అదనపు డైరెక్టర్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!