

వైభవ్ సూర్యవంశీ తరహాలో భారత క్రికెట్‌లో మరో యువ ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఉమ కశ్వీకి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో దిల్లీ క్యాపిటల్స్ జట్టులో చోటు దక్కింది. దీంతో డబ్ల్యూపీఎల్‌లో స్థానం సంపాదించిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు 16 ఏళ్ల దియా దయాళ్ పేరిట ఉండగా, ఉమ దాన్ని అధిగమించింది. కర్ణాటకకు చెందిన ఉమ ఏడేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. బ్యాటింగ్‌తో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లోనూ ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదిగింది. 2023లో బెంగళూరులో జరిగిన అంతర్ పాఠశాలల టోర్నీలో 12 ఏళ్ల వయసులో అజేయంగా 217 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
వయసు విభాగాల టోర్నీల్లోనూ ఉమ నిలకడగా రాణించింది. 2025 మహారాణి ట్రోఫీలో బెంగళూరు బ్లాస్టర్స్‌కు సారథ్యం వహించడంతో పాటు మైసూర్ వారియర్స్‌పై 42 బంతుల్లో 48 పరుగులు చేసింది. అండర్-19 వన్డే టోర్నీలో కర్ణాటక సెమీఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. 2026 జాతీయ అండర్-19 టీ20 టోర్నీలో విదర్భతో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 18 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టింది. ఆ ప్రదర్శనతో భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకుని శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల్లో నాలుగు వికెట్లు, రెండు వన్డేల్లో రెండు వికెట్లు తీసింది. మహిళల అండర్-15 వన్డే టోర్నీలో 172 సగటుతో 516 పరుగులు సాధించింది. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉన్నాయి. మణిపుర్‌పై 66 బంతుల్లో 156 పరుగులతో మెరిసింది. ఈ ప్రదర్శనలతో ఆకట్టుకున్న దిల్లీ క్యాపిటల్స్ తాజా వేలంలో రూ.10 లక్షలకు బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఉమను కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో తుది జట్టులో అవకాశం దక్కితే ఆమె ఎలా రాణిస్తుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!