

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన పెట్టుబడుల పరిధిని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. అధిక వృద్ధి అవకాశాలున్న అంకుర సంస్థలు, ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల (ఏఐఎఫ్)లో నిధులు పెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఏటా కొత్తగా సమకూరే నిధుల్లో గరిష్ఠంగా 3 శాతం వరకు ఈ తరహా పెట్టుబడులకు కేటాయించే అంశంపై చర్చ జరుగుతోంది. అధిక వృద్ధి కలిగిన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈపీఎఫ్‌ఓకు ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0లో భాగస్వామి కావాలని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సూచించింది. కేటగిరీ-1, కేటగిరీ-2 ఏఐఎఫ్‌లలో ఈపీఎఫ్‌ఓ పెట్టుబడుల అంశంపై సెబీ కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను వచ్చే నెలలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగే ఈపీఎఫ్‌ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశం ముందుకు తీసుకురానున్నారు.
తొలుత నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్), భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) నిర్వహించే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని ఈపీఎఫ్‌ఓ పరిశీలిస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విధానం ప్రకారం, కొత్తగా సమకూరే నిధుల్లో గరిష్ఠంగా 5 శాతం వరకు ఆస్తుల ఆధారిత, ట్రస్ట్ నిర్మాణం కలిగిన పెట్టుబడులకు కేటాయించే అవకాశం ఉంది. కేటగిరీ-1 ఏఐఎఫ్‌లు అంకుర సంస్థలు, చిన్న వ్యాపారాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వెంచర్ క్యాపిటల్‌కు నిధులు సమకూరుస్తాయి. కేటగిరీ-2లో ప్రైవేట్ ఈక్విటీ, స్థిరాస్తి, ప్రైవేట్ డెట్ ఫండ్లు ఉంటాయి. పెట్టుబడుల్లో నష్టభయాన్ని తగ్గించేందుకు ఒక్కో ఏఐఎఫ్ కనీస నిధి పరిమాణం రూ.100 కోట్లుగా ఉండాలని, ఒకే ఫండ్‌లో అధిక మొత్తాన్ని పెట్టకుండా పరిమితులు విధించాలని ప్రతిపాదిస్తున్నారు. విదేశాల్లో నమోదైన సంస్థల్లో పెట్టుబడులపైనా ఆంక్షలు ఉండనున్నాయి. ప్రస్తుతం 30 కోట్ల మంది చందాదారులకు చెందిన రూ.30 లక్షల కోట్లకు పైగా నిధులు ఈపీఎఫ్‌ఓ వద్ద ఉన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!