

ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నుంచి డిసెంబరు వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ మూడో వారంలో దక్షిణ భారతదేశంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఈ సీజన్లో వర్షపాతం సాధారణ స్థాయిలోనే ఉండొచ్చని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే ముగిసిన నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు నమోదైంది. ఏపీలోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రానున్న వర్షాలపై రైతులు, జలవనరుల శాఖలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇదిలా ఉండగా, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు బలంగా కొనసాగుతున్నాయని, ఈ పరిస్థితులు రానున్న నెలల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) పరిస్థితులు తటస్థంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు సాధారణ స్థాయిలో ఉండొచ్చని అంచనా. నీటి లభ్యతను పర్యవేక్షిస్తూ జల వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!