

భారత్–బెల్జియం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. వాణిజ్యం, రక్షణ, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, సాంకేతికత సహా వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించాయి. బెల్జియం ప్రధాని బార్ట్ డి వేవెర్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. రక్షణ, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. వచ్చే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
భేటీ అనంతరం మోదీ మాట్లాడుతూ.. ప్రపంచం సంక్షోభాలు, ఘర్షణలు, సరఫరా వ్యవస్థల్లో అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. గత త్రైమాసికంలో 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడం దేశ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత్–బెల్జియం రక్షణ, భద్రతా సహకారాన్ని ద్వైపాక్షిక సంబంధాలకు కీలక స్తంభంగా అభివర్ణించారు. సైనిక మార్పిడులు, శిక్షణ, రక్షణ రంగంలో సహ అభివృద్ధి, సహ ఉత్పత్తికి కొత్త అవకాశాలను కల్పించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారు. స్టార్టప్‌లు, మారిటైమ్, విశ్వవిద్యాలయాలు, పరిశోధన రంగాల్లోనూ సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రతిభావంతుల రాకపోకలను సులభతరం చేసేందుకు ‘వలస, బదిలీ భాగస్వామ్య ఒప్పందం’పై త్వరలో ముందుకు సాగుతామని చెప్పారు. భారత్–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని బెల్జియం ప్రధాని స్వాగతిస్తూ.. ఇరుదేశాలు గతంలో కంటే విస్తృతమైన, వ్యూహాత్మక సంబంధాలను నిర్మించుకుంటున్నాయని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!