

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు, కార్యకర్తల ఆమోదం, అభ్యర్థుల పనితీరును ప్రాతిపదికగా చేసుకుని టికెట్లు కేటాయిస్తామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అక్టోబరులో వారం వ్యవధిలోనే పట్టణ స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, అవసరమైతే అంతకంటే ఎక్కువ ఇస్తామే తప్ప తగ్గించబోమని స్పష్టం చేశారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అంతరాలు లేకుండా ముందుకు సాగాలని పార్టీ నేతలను ఆదేశించారు.
స్థానిక ఎన్నికల సన్నద్ధతపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జోనల్ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు కీలక సూచనలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ ప్రస్తుత పరిస్థితిని స్థానిక ఎన్నికల ద్వారా అంచనా వేసుకోవచ్చన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సామాజిక, రాజకీయ సమీకరణాలను అధ్యయనం చేసి అభ్యర్థుల ఎంపికపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టి, పాజిటివ్ ఎజెండాతో ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!