

రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చేపట్టిన వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన 50 వ్యాజ్యాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. వార్డుల పునర్విభజన వల్ల స్థానిక సంస్థల భౌగోళిక సరిహద్దుల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వార్డుల పునర్విభజన అడ్డంకి కాదని పేర్కొంది. కార్పొరేషన్లలో వార్డులకు ప్రత్యేక పరిపాలనా అధికారాలు లేనందున వాటిని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లుగా పరిగణించలేమని తెలిపింది.
జనగణన-2027 నేపథ్యంలో పరిపాలనా విభాగాల సరిహద్దులను స్తంభింపజేస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌ను వార్డుల పునర్విభజనకు వర్తింపజేయలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. వార్డుల పునర్విభజనను జనాభా లెక్కలు, స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్‌తో ముడిపెట్టలేమని పేర్కొంది. సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకే వార్డుల పునర్విభజన చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. పునర్విభజనను అడ్డుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎన్. హరినాథ్ గురువారం వ్యాజ్యాలన్నింటినీ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!