

పశ్చిమ దేశాలకు వెళ్లే భారత విమానాల కోసం పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భారత్ నిమగ్నమైంది. ఇందులో భాగంగా చైనా గగనతలాన్ని వినియోగించుకునే విషయమై ఆ దేశంతో చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధ్రువీకరించారు.
2025 ఏప్రిల్ నుంచి భారత విమానాలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ నిషేధాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించింది. దీనివల్ల పశ్చిమ దేశాలకు వెళ్లే భారత విమానయాన సంస్థలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రయాణ సమయంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన హోటాన్ మార్గాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి సారించామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. "మేము ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. హోటాన్ మార్గంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మా విదేశాంగ శాఖ ఈ విషయంపై చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి, కానీ మేమైతే ప్రత్యామ్నాయాల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాం" అని ఆయన వివరించారు.
హోటాన్ మార్గంపై గత ఏడాది కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరైన కొన్ని రోజులకే మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా, భారత్-చైనా మధ్య విమాన సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. చైనా సదరన్ ఎయిర్లైన్స్, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు ఇప్పటికే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!