

భారత్‌లో మత స్వేచ్ఛ పరిస్థితి దిగజారుతోందంటూ అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్ కమిషన్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మతపరమైన కారణాలతో భారత్‌లో అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించిన ఆ కమిషన్.. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన షార్జీల్ ఇమామ్ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మత స్వేచ్ఛ కోసం గళమెత్తినందుకే ఆయన కొన్నేళ్లుగా నిర్బంధంలో ఉన్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా తీవ్రంగా ఖండించారు.
ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు అమెరికాలోని పక్షపాత ధోరణులపై ఆత్మపరిశీలన చేసుకోవాలని వినయ్ క్వాత్రా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కు సూచించారు. భారత పౌరుల రాజ్యాంగ హక్కులపై తీర్పులు చెప్పే అర్హత ఆ కమిషన్‌కు లేదని స్పష్టం చేశారు. పక్షపాతంతో కూడిన వ్యాఖ్యలు, తప్పుడు సమాచారంతో రూపొందించిన అంచనాలు భారత్‌లోని మత స్వేచ్ఛ, రాజ్యాంగ విలువలను దెబ్బతీయలేవని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా భారత్‌కు సంబంధించి వాస్తవాల కంటే ఎంపిక చేసిన అంశాలు, సందేహాస్పద కథనాల ఆధారంగా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ నివేదికలు రూపొందిస్తోందని విమర్శించారు. మత స్వేచ్ఛ అంశంలో ఆ కమిషన్ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని భారత్ గతంలోనూ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!