

హర్మూజ్ జలసంధి సమీపంలో జరిగిన ఒక కీలక రక్షణ చర్యలో మానవ రహిత డ్రోన్ బోట్ చరిత్ర సృష్టించింది. అమెరికాకు చెందిన ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన తర్వాత సముద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు అమెరికా పైలట్లను ఈ డ్రోన్ బోట్ సురక్షితంగా రక్షించింది. అమెరికా చేపట్టిన ఈ వినూత్న ఆపరేషన్ విజయవంతం కావడంతో రక్షణ రంగంలో స్వయంచాలక సముద్ర సాంకేతికత ప్రాధాన్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ డ్రోన్ బోట్‌ను భారతీయ-అమెరికన్ ఇంజినీర్ వైభవ్ ఆల్టేకర్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న టెక్సాస్‌కు చెందిన సరోనిక్ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసింది.
2022లో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో స్థాపించబడిన సరోనిక్ టెక్నాలజీస్ సంస్థలో వైభవ్ ఆల్టేకర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అభ్యసించిన ఆయన ఆటానమస్ సిస్టమ్స్ మరియు సముద్ర సాంకేతికతలో నిపుణుడిగా గుర్తింపు పొందారు. 24 అడుగుల పొడవు కలిగిన కోర్స్‌ఎయిర్ డ్రోన్ బోట్ నిఘా, మందుపాతరల గుర్తింపు, శత్రు కదలికల పర్యవేక్షణ వంటి కీలక కార్యకలాపాల్లో వినియోగిస్తున్నారు. ఈ విజయవంతమైన రక్షణ చర్య భవిష్యత్తులో రక్షణ రంగంలో డ్రోన్ సాంకేతికత వినియోగానికి కొత్త దిశను చూపించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!