

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని గుర్తింపు కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కమిటీ సమావేశమైంది. కమిటీ చైర్మన్ కే. కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఇప్పటివరకు చేపట్టిన గుర్తింపు ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలు, కళాకారులు, సబ్బండ వర్గాల ప్రతినిధులతో ఇప్పటికే జరిపిన సంప్రదింపులపై చర్చించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు అభిప్రాయాలు పంచుకున్నారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న వెబ్‌సైట్ ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. వెబ్‌సైట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. వెబ్‌సైట్ ప్రారంభ తేదీని ఖరారు చేసే అంశంపై చర్చించిన సభ్యులు.. దాని పురోగతిని సమీక్షించేందుకు త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వెబ్‌సైట్ ప్రారంభ తేదీతో పాటు గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన తదుపరి కార్యాచరణపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి, శ్యాం మోహన్ పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!