

కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు విజయకుమార్ నాయుడు (77) చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం ప్రాంతంలోని బత్తలవల్లం కేంద్రంగా ఆయన స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ అనంతరం ‘ఏకం’గా కొనసాగింది. ధ్యానం, ఆత్మపరిశీలన, అంతర్గత మార్పు, మానసిక ప్రశాంతత వంటి అంశాలపై ఆయన బోధనలు సాగాయి. ఆయన మృతితో భక్తులు, శిష్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భక్తుల దర్శనార్థం ఆయన భౌతిక దేహాన్ని ఏకం క్షేత్రంలో ఉంచనున్నట్లు సమాచారం.
1949లో తమిళనాడులో జన్మించిన విజయకుమార్ చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసి కొంతకాలం ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేశారు. అనంతరం ఆధ్యాత్మికత, ప్రత్యామ్నాయ విద్య వైపు అడుగులు వేశారు. 1980ల మధ్యలో ప్రస్తుత చిత్తూరు జిల్లా పరిధిలోని రాజుపేట సమీపంలో ‘జీవాశ్రమం’ పేరుతో రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించారు. విద్యార్థుల వికాసం, ఆత్మపరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ తరువాత ‘సత్యలోకం’గా ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. 1980ల చివర్లో కల్కి అవతార భావనతో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయన, భార్య పద్మావతితో కలిసి ‘వన్నెస్’ ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు. బత్తలవల్లంలో నిర్మించిన తెల్లటి పాలరాతి వన్నెస్ టెంపుల్ 2005లో ప్రారంభమైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!