

హిందూ సంప్రదాయంలో కార్తిక మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శివకేశవుల ఆరాధనకు ప్రధానమైన ఈ మాసంలో ప్రతిరోజూ దీపారాధన, తులసి పూజ, శివాభిషేకాలు, ఉపవాసాలు నిర్వహించడం విశేషం. కార్తిక పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడనే సంప్రదాయ విశ్వాసం ఆధారంగా ఈ మాసానికి కార్తిక మాసం అనే పేరు వచ్చింది. 2026లో నవంబర్ 10, మంగళవారం కార్తిక శుద్ధ పాడ్యమితో ఈ మాసం ప్రారంభమై, డిసెంబర్ 8, మంగళవారం కార్తిక బహుళ అమావాస్యతో ముగియనుంది. ఈ నెలలో పలు ముఖ్యమైన పండుగలు, వ్రతాలు, ఆలయ ఉత్సవాలు జరగనున్నాయి.
నవంబర్ 10న బలి పాడ్యమి, ఆకాశదీపారంభం, నవంబర్ 13న నాగుల చవితి, నవంబర్ 20న ప్రబోధన ఏకాదశి, నవంబర్ 21న క్షీరాబ్ది ద్వాదశి, కైశిక ద్వాదశి నిర్వహించనున్నారు. నవంబర్ 24న కార్తిక పౌర్ణమి, గురునానక్ జయంతి, జ్వాలా తోరణం, కృత్తికా దీపోత్సవం జరగనున్నాయి. యాజ్ఞవల్క్య జయంతి, కోటి సోమవారం, సంకష్టహర చతుర్థి, సర్వ ఏకాదశి, మాస శివరాత్రి వంటి ఇతర పర్వదినాలు కూడా ఈ మాసంలో రానున్నాయి. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, నాగలాపురం ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు ఈ పుణ్య తిథుల్లో సంప్రదాయ పూజలు, వ్రతాలు ఆచరించి శివకేశవుల అనుగ్రహం పొందాలని కోరుకుంటారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!