

సాధారణంగా పండుగల వేళ ఉద్యోగులకు స్వీట్లు, బహుమతులు ఇచ్చి యాజమాన్యాలు ఆనందం పంచుకుంటాయి. కానీ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి మాత్రం తన ఉద్యోగులకు ఊహించని కానుక అందించారు. ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా నగదు బోనస్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఆయన ఔదార్యానికి ఉద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. ఓ మహిళ బోనస్ అందుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సూరత్‌లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న రామ్‌స్వరూప్ ముండే తన వద్ద పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు ఈ బోనస్ అందించారు. రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లను ఓ వెండి రంగు పళ్లెంలో అందంగా పేర్చి ఒక్కొక్కరికీ ఇచ్చారు. భారీ మొత్తంలో నగదు చూసి ఉద్యోగులు తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో ముండే కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
తన చిన్నతనంలో పేదరికాన్ని అనుభవించానని, పండుగల సమయంలో కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు తనకు తెలుసని ముండే తెలిపారు. తన దుకాణంలో పనిచేసేవారిని కేవలం ఉద్యోగులుగా కాకుండా కుటుంబ సభ్యులుగానే భావిస్తానని చెప్పారు. ఏడాది పొడవునా వారు చూపించే కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావమే వ్యాపార అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా ఉద్యోగులు తమ కుటుంబాల కోసం అవసరమైన వస్తువులు కొనుక్కుని, సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఖర్చు గురించి ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఉద్యోగుల పట్ల వ్యాపారి చూపిన ఆప్యాయత, ఔదార్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!