

దేశంలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని కవాడిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత దేశానికి ప్రధాన ఆస్తి అని, వారిని డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని కొందరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ పిలుపుతో ప్రారంభమైన ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమాన్ని బస్తీ స్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంతో పాటు, డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్నవారిని గుర్తించి చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తామని చెప్పారు.
డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు, దేశ సరిహద్దుల్లో తనిఖీలను బలోపేతం చేసేందుకు జాగిలాల సంఖ్యను పెంచుతున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. మాదకద్రవ్యాల బారినపడిన వారికి చికిత్స అందించేందుకు పునరావాస కేంద్రాలను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ నుంచి బయటపడిన వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని, తెలంగాణలో క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ సెంటర్లను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ‘నషా ముక్త్ భారత్’పై అవగాహన కల్పించేందుకు మూడు రోజుల పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 25న అంబర్‌పేట నుంచి ప్రారంభమయ్యే యాత్ర 27న జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్ వద్ద ముగుస్తుందని వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!