

మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు మరాఠీ మాట్లాడటం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనపై వివాదం ముదిరింది. నిబంధనలను పాటించని డ్రైవర్లకు రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా మరాఠీ నేర్చుకోవాలని, లేకపోతే లైసెన్సులు, పర్మిట్లకు సంబంధించిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడంతో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
రవాణా శాఖ చర్యలను వ్యతిరేకిస్తూ ముంబైలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మూడు రోజుల సమ్మె ప్రారంభించారు. ముంబై, ఎంఎంఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టడంతో కొన్ని చోట్ల రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వయసు పైబడిన డ్రైవర్లు, తక్కువ విద్యాభ్యాసం ఉన్నవారు తక్కువ సమయంలో మరాఠీ నేర్చుకోవడం కష్టమని డ్రైవర్ సంఘాలు చెబుతున్నాయి. లాంగ్వేజ్ పరీక్షలో విఫలమైతే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధించే ప్రతిపాదనపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు తమ జీవనోపాధిపై ప్రభావం చూపుతాయని, మరాఠీ నేర్చుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరోవైపు, మరాఠీ నిబంధనను అమలు చేసేందుకు ఆర్టీవో అధికారులు డ్రైవర్లకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుడిని ఎక్కడికి వెళ్లాలి అని అడగడం, ప్రయాణ ఛార్జీని చెప్పడం, మీటర్‌కు సంబంధించిన సాధారణ విషయాలను వివరించడం వంటి రోజువారీ సంభాషణలను మరాఠీలో నిర్వహించగలరా లేదా అన్నదే పరీక్షలో ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అయితే పరీక్షలో విఫలమైన వెంటనే లైసెన్సులు రద్దు చేయబోమని రవాణా శాఖ స్పష్టం చేసింది. భాష నేర్చుకునేందుకు అదనపు సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటికే సుమారు 1.65 లక్షల మంది డ్రైవర్లు మరాఠీ శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందినట్లు సమాచారం.
ఈ వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మరాఠీ నేర్చుకోవాలన్న అంశాన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దని ఆయన అన్నారు. భాష పేరుతో డ్రైవర్ల జీవనోపాధికి నష్టం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయడం లేదని తెలిపారు. మరాఠీ నేర్చుకునేందుకు ఇచ్చిన గడువును పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రయాణికులతో రోజువారీగా మాట్లాడేందుకు అవసరమైన ప్రాథమిక మరాఠీని డ్రైవర్లు నేర్చుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!