

రానున్న వ్యవసాయ సీజన్లలో ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడిపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఆహార భద్రతను పటిష్టం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), ఇతర సంస్థాగత అవసరాలకు కనీసం 15 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు సిద్ధం చేయాలని సూచించారు. నవంబర్ 25న హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ఉన్నాయని, మరో నెలకు సరిపడా అదనపు బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సన్నధాన్యం సేకరణను గరిష్ఠ స్థాయికి పెంచాలని, ప్రభుత్వ సన్నబియ్యం పథకానికి నిరంతరాయంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్న విషయాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తెలియజేయాలని సూచించారు.
రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకుల జాబితాను విస్తరించేందుకు ఆర్థికంగా సాధ్యమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రతిపాదనలను కేబినెట్ సబ్ కమిటీ ముందుంచనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక సైలో సముదాయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రధానంగా ధాన్యం సేకరణ జరిగే పది క్లస్టర్లను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక సంస్థాగత రుణాలను పొందే అవకాశాలను పరిశీలించనున్నారు. ఈ ప్రతిపాదనలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలన అనంతరం రాష్ట్ర కేబినెట్ ఆమోదానికి సమర్పించనున్నారు. మరోవైపు, రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల వసూళ్లలో ఎలాంటి రాజీ ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని కాపాడేందుకు వసూళ్ల ప్రక్రియను క్రమబద్ధంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!