

ఢిల్లీలో ఏఐసీసీ నిర్వహించిన మార్చ్ తరహాలో హైదరాబాద్‌లోనూ భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తెలిపారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సుమారు రెండు లక్షల మందితో ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ చేపట్టే ఆలోచన ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ర్యాలీ మార్గం, తేదీని ఖరారు చేస్తామని వెల్లడించారు. దసరా తర్వాతే తేదీని నిర్ణయించే అవకాశం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏఐసీసీ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తానని మహేశ్ గౌడ్ తెలిపారు. ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని అంగీకరించారు. కార్మికులకు న్యాయం చేయడం, సంస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై తప్పుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మహిళా జర్నలిస్టులపై దాడి జరిగిందన్న ఆరోపణలతో పాటు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది తోసేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వీడియోలో శివకుమార్‌ను వెనక్కి రావాలని పిలిచిన విషయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే షూ లేస్‌ను రాహుల్ గాంధీ సరిచేశారని తెలిపారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపే హక్కును కాలరాయడాన్ని సహించబోమని అన్నారు. తెలంగాణలో ధర్నా చౌక్‌ను తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, కేంద్రంలో బీజేపీ ఓటమి ఖాయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!