

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. బతుకమ్మ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన తెలంగాణ ఆడపడుచులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. పెద్దలు ఆశీర్వదిస్తూ చెప్పే ‘బతుకు అమ్మా’ అనే దీవెనలోనే ఈ పండుగ గొప్పతనం ఇమిడి ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజాపాలన సాగిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. గాంధీ భవన్లో జరిగిన వేడుకల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!