

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలోని జలాశయాల్లో నీటినిల్వలు తగ్గి తాగునీటి సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ శాఖలో భారీగా ఖాళీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చీఫ్ ఇంజినీర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పలు పోస్టులు ఖాళీగా ఉండటంతో పనుల నిర్వహణ, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. శాఖలో తొమ్మిది చీఫ్ ఇంజినీర్ పోస్టులకు ఐదుగురే పనిచేస్తుండగా, 78 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు 33 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 180 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 15 డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు కూడా భర్తీ కావాల్సి ఉంది.
మరోవైపు ఖాళీలను భర్తీ చేయకుండా ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలోని ఐదుగురు చీఫ్ ఇంజినీర్లకు జిల్లా సర్కిళ్ల అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో పాటు 50 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రయోగశాలలు, క్షేత్రస్థాయిలోని సిబ్బందిలోనూ కొరత ఉందని చెబుతున్నారు. మిషన్ భగీరథకు ప్రధాన నీటి వనరులుగా ఉన్న 34 రిజర్వాయర్లలో నీటినిల్వలు తగ్గడంతో ప్రభుత్వం తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అత్యవసర పనులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, పర్యవేక్షణకు పూర్తిస్థాయి సిబ్బంది అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. ఖాళీల భర్తీ, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని వారు కోరుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!