

రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. త్వరలో 16 భారీ హోటళ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తుండగా.. పర్యావరణ పర్యాటక అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
పర్యాటక రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. కృత్రిమ మేధ ఆధారంగా 130 పర్యాటక ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వాటిని స్కాన్ చేస్తే ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. సందేహాలను దాదాపు 120 భాషల్లో నివృత్తి చేసేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. క్యారవాన్ పర్యాటకం, హోమ్‌స్టే, భూకేటాయింపు విధానాల ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా ‘గోదావరి పిలుస్తోంది.. గోదావరి కాల్స్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఎనిమిది పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం రూ.428 కోట్లు మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!