

అర్నబ్ తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, సుబ్బరాజుపేటలో పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అధికారులతో ఫోన్ ద్వారా పరిస్థితిని సమీక్షించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందని, విద్యుత్, టెలిఫోన్ సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మధ్యాహ్నానికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి కోరారు. వ్యవసాయంపై ఆధారపడిన నిడదవోలు నియోజకవర్గంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తరచూ పంట నష్టాలను ఎదుర్కొంటుండటం బాధాకరమని అన్నారు. తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించానని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని వివరించానని తెలిపారు. పంట నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగిన పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తుఫాన్ ప్రభావిత ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!