

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీలు), శుద్ధి చేసిన నీటి వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేష్ వి. పాటిల్ తదితరులు హాజరయ్యారు. ట్రీటెడ్ వాటర్ ప్లాంట్లలో ఏఐ సాంకేతికతను వినియోగించాలని, నీటి నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ప్లాంట్‌కు ప్రత్యేక అధికారిని నియమించి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ప్లాంట్ల పర్యవేక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలని, ట్రీటెడ్ వాటర్ ట్యాంకర్ల కదలికలను ట్రాక్ చేయాలని సూచించారు. ప్రజలకు సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి, విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ల్యాండ్‌స్కేపింగ్, రోడ్ల శుభ్రతకు శుద్ధి చేసిన నీటినే వినియోగించాలని సీఎం ఆదేశించారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, పబ్లిక్ పార్కులు, రైల్వే శాఖ, మెట్రో రైలు వ్యవస్థల్లోనూ ట్రీటెడ్ వాటర్ వినియోగాన్ని విస్తరించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీటికి సంబంధం లేని అవసరాల కోసం శుద్ధి చేసిన నీటిని వంద శాతం వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలని, భవన నిర్మాణ అనుమతుల్లోనూ దీనికి సంబంధించిన నిబంధనలు చేర్చాలని పేర్కొన్నారు. ప్లాంట్లను సౌర విద్యుత్తుతో నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని, ప్రైవేట్ ఎస్‌టీపీలను ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకు కూడా ట్రీటెడ్ వాటర్ అందించాలని సూచించారు. నవంబర్ 1 నుంచి నిర్ణయాలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో తాగునీటి కొరత రాకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!