

హైదరాబాద్‌లో రూపొందించిన విద్యాసంస్థల కోసం ప్రత్యేక ఏఐ సాఫ్ట్‌వేర్ సూట్ ‘బ్రిలియన్స్ ఏఐ’ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రశ్నాపత్రాల తయారీ, జవాబు పత్రాల మూల్యాంకనం నుంచి విద్యార్థుల సందేహాల నివృత్తి వరకు వివిధ విద్యా కార్యకలాపాలకు ఈ సాఫ్ట్‌వేర్ సేవలు అందించనుంది. టెక్స్ట్, వాయిస్ ఆధారిత సదుపాయాలతో పాటు విద్యార్థుల విద్యా పురోగతిపై తల్లిదండ్రులకు నివేదికలు అందించే సాంకేతికతను కూడా ఇందులో పొందుపరిచారు. విద్యా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని మంత్రి పేర్కొన్నారు. సంప్రదాయ బోధనా విధానాలకు ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరచవచ్చని తెలిపారు.
ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా భద్రత, గోప్యత, డిజిటల్ వ్యవస్థల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీధర్ బాబు సూచించారు. పరీక్షా పత్రాల లీకేజీలతో పాటు డేటా లీకేజీలను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏఐ సాధనాలు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది పరిశీలించాలని, వాటి వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ భద్రత, గోప్యత కీలకమని అన్నారు. విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఎడ్యుటెక్ 2025 సర్వే ప్రకారం, విద్యా సాంకేతికతను ఉపయోగిస్తున్న పిల్లల్లో 77 శాతం మంది ప్రాక్టీస్, అభ్యాసం కోసం దాన్ని వినియోగిస్తున్నారని మంత్రి వివరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!