

ఈ నెల 14న హైదరాబాద్లో గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రతపై భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. శిల్పకళావేదిక నుంచి హెచ్ఐసీసీ వరకు ర్యాలీ కొనసాగనుండగా, అనంతరం హెచ్ఐసీసీ సమీపంలోని జయభేరి, మీనాక్షి టవర్స్ పక్కన ఉన్న మైదానంలో గిగ్ వర్కర్లతో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సభా ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రతకు సంబంధించి కీలక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాలీ, సభలో రాహుల్ గాంధీ నేరుగా గిగ్ వర్కర్లతో మాట్లాడనున్నారు. వారికి సామాజిక భద్రత, సంక్షేమ భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. రాహుల్ గాంధీ పర్యటన, సభ విజయవంతమయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!