

సౌదీ అరేబియాలో హూతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ధహ్రాన్లోని చమురు దిగ్గజం అరాంకో ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం. మరోవైపు రాజధాని రియాద్లో క్షిపణుల శకలాలు పడటంతో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు, ఓ చిన్నారి ఉన్నారు. ఈ ఘటనలో 15 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. హూతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతుండగా, సౌదీ రక్షణ బలగాలు వాటిని అడ్డుకునేందుకు క్షిపణి నిరోధక వ్యవస్థలను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో కూల్చివేసిన క్షిపణుల శకలాలు జనావాసాలపై పడటంతో నష్టం వాటిల్లుతున్నట్లు సమాచారం. ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థల్లో ఒకటైన అరాంకోపై దాడి జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సంస్థ కార్యకలాపాలపై ఈ ఘటన ప్రభావం ఎంతమేర ఉందనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
మరోవైపు, యెమెన్ రాజధాని సనా శివార్లలోని అల్-సబాహా ఇంధన కేంద్రంపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు దాడి చేసినట్లు సమాచారం. సౌదీలోని విమానాశ్రయాలు, ఇంధన సముదాయాలపై దాడులకు హూతీ తిరుగుబాటుదారులు ఈ కేంద్రాన్ని వినియోగిస్తున్నారని సంకీర్ణ దళాలు ఆరోపించాయి. ఈ కేంద్రంలో సుమారు 58 వేల టన్నుల ఇంధనాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు హూతీలు వెల్లడించారు. పరస్పర దాడులతో సౌదీ అరేబియా, యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది. కీలక చమురు మౌలిక సదుపాయాలు, ఇంధన నిల్వ కేంద్రాలు లక్ష్యంగా మారుతుండటంతో ప్రాంతీయ భద్రత, ఇంధన సరఫరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!