

తయారీ కేంద్రం స్థాయి నుంచి పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగం కొత్త దశలోకి అడుగుపెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైటెక్ సిటీలో అంతర్జాతీయ బయోఫార్మాస్యూటికల్ సంస్థ ఎంఎస్‌డీ ఏర్పాటు చేసిన 2.5 లక్షల చదరపు అడుగుల టెక్నాలజీ సెంటర్‌ను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ కేంద్రంలో డిజిటల్, డేటా ఎనలిటిక్స్, కృత్రిమ మేధ, టెక్నాలజీ, ఇంజినీరింగ్ విభాగాల్లో అధునాతన కార్యకలాపాలు కొనసాగనున్నాయి. వైద్య, ఆరోగ్య పరిశోధనలకు సంబంధించిన సాంకేతిక పరిష్కారాలను హైదరాబాద్ నుంచి ప్రపంచ దేశాలకు ఎంఎస్‌డీ అందించనుంది.
తెలంగాణలో ఇప్పటికే 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు ఉన్నాయని శ్రీధర్‌బాబు తెలిపారు. గత రెండేళ్లలో పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణ కార్యకలాపాలను ప్రారంభించాయని చెప్పారు. ‘నెక్స్ట్‌జెన్ లైఫ్‌సైన్సెస్ పాలసీ 2026-30’ ద్వారా డిస్కవరీ నుంచి తయారీ, క్లినికల్ రీసెర్చ్, టెక్నాలజీ వరకు పూర్తి విలువ శ్రేణిని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఫ్యూచర్ సిటీలో 2,100 ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఇందులో 100 ఎకరాల్లో అధునాతన బయోలాజిక్స్ హబ్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీంతో హైదరాబాద్ ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ హబ్‌గా మరింత బలోపేతమవుతుందని అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!