

గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన అవసరం లేదు. ఆ నిధులను స్థానిక అవసరాలకు వినియోగించేందుకు ఖజానా అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రామసభ తీర్మానం మేరకు పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, ఇతర స్థానిక అవసరాలకు నిధులను వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3)కు ప్రభుత్వం సవరణ చేసింది. గురువారం శాసనసభ ఈ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. చర్చ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు పన్నులు, సుంకాలు, ఫీజులు వసూలు చేసి స్థానికంగానే ఖర్చు చేసే అధికారం ఉందన్నారు. 2018లో నాటి ప్రభుత్వం చేసిన చట్ట సవరణతో ఈ అధికారం పరిమితమైందని, ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో జమ చేసేలా నిబంధనలు మార్చారని తెలిపారు.
మున్సిపాలిటీలకు నిధుల వినియోగంలో అవకాశం కల్పించి, గ్రామ పంచాయతీలపై వివక్ష చూపారని సీతక్క విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులు బ్యాంకు ఖాతాల్లో జమై వినియోగిస్తున్నట్లే పంచాయతీల సొంత ఆదాయాన్ని కూడా ఇకపై బ్యాంకుల్లో జమచేసుకుని వినియోగించుకునేలా సవరణ తీసుకొచ్చినట్లు చెప్పారు. 2018కు ముందు రిజిస్ట్రేషన్ల స్టాంప్ డ్యూటీలో పంచాయతీలకు వచ్చే వాటాను కూడా నాటి ప్రభుత్వం తగ్గించిందని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతినెలా పంచాయతీలకు రూ.50 కోట్లు విడుదల చేస్తున్నామని, 2025-26లో రెండో విడతగా కేంద్రం నుంచి రూ.619 కోట్లు రావాల్సి ఉందన్నారు. మల్టీపర్పస్ సిబ్బంది వేతనాల పెంపు, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్టోబర్ తర్వాత గ్రామాల్లో పొలం బాటల నిర్మాణ పనులు చేపడతామని, ఎన్నికలు జరగని ఏజెన్సీలోని 52 పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తామని వెల్లడించారు. బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ కుబేర్ సాఫ్ట్‌వేర్ కారణంగా బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని పేర్కొనగా, పాల్వాయి హరీశ్‌బాబు పంచాయతీలకు ఉన్న రూ.1,500 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!