

ప్రపంచానికి సురక్షితమైన, సుస్థిరమైన, అంతర్జాతీయ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఉండే అంతరిక్ష రంగం అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతరిక్ష పరిశోధనల ద్వారా సేకరించే శాస్త్రీయ సమాచారాన్ని సమష్టి ప్రయోజనాలకు వినియోగించాలన్నదే భారత్ లక్ష్యమని తెలిపారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ ఖగోళ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి గురువారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవితవ్యం అనే భావన భూమి నుంచి అంతరిక్షం వరకు విస్తరించాలన్నారు.
భారత్ అంతరిక్ష ప్రయాణాన్ని బలోపేతం చేయడంలో ఇస్రో కీలక పాత్ర పోషించిందని మోదీ ప్రశంసించారు. ఇస్రో సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 430 ఉపగ్రహాలను భారత రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపినట్లు తెలిపారు. చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరిన తొలి దేశంగా భారత్ నిలిచిందని గుర్తుచేశారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం, 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇదే సమయంలో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. భారత్-జర్మనీ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ప్రత్యామ్నాయ ఇంధనం, ఆధునిక సాంకేతికత రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!