

బాలీవుడ్ నటుడు, ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్కు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లాలని పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల ముంబయిలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో ఆయన పాల్గొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నోటీసులకు సంబంధించిన పూర్తి వివరాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొనడంపై భాజపా నాయకుడు కిరీట్ సోమయ్య ఫిర్యాదు చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇమ్రాన్ అమెరికా పౌరుడని, ఆయన భారత విదేశీ పౌరసత్వ హోదా, వీసా నిబంధనలను ఉల్లంఘించారని సోమయ్య ఆరోపించినట్లు సమాచారం. విదేశీ పౌరుడైన ఆయనపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నిరసనల సమయంలో పోలీసులు ఇమ్రాన్ ఖాన్ను అదుపులోకి తీసుకుని, అనంతరం విడుదల చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!