

హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్, ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 28న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రోడ్డుపక్కన బైక్‌ను పార్క్ చేసి ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో ట్రాఫిక్ పోలీసులు అతడి వాహనాన్ని టోయింగ్ వాహనంలో తరలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో డెలివరీ ఏజెంట్ పోలీసుల వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి.. తన బైక్‌ను తీసుకెళ్లకుండా వదిలేయాలని, కనీసం ఆర్డర్ డెలివరీ చేసి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ‘ప్లీజ్ సార్.. నా భార్య ఆస్పత్రిలో ఉంది. ఆర్డర్ డెలివరీ చేసి వెళ్లిపోతాను’ అంటూ అతడు వేడుకున్నట్లు వీడియోలో వినిపిస్తోంది.
అయితే వాహనాన్ని అక్కడికక్కడే తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, పోలీస్ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లాలని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో టోయింగ్ వాహనాన్ని ఆపేందుకు డెలివరీ ఏజెంట్ ప్రయత్నించగా.. అందులో ఉన్న ఓ పోలీసు అధికారి తలుపు తెరిచి అతడిని పక్కకు నెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ఉల్లంఘన జరిగితే జరిమానా విధించి చర్యలు తీసుకోవచ్చని, అదే సమయంలో అత్యవసర పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే బైక్‌ను ఏ నిబంధనల కింద సీజ్ చేశారు? డెలివరీ ఏజెంట్ చెప్పిన అత్యవసర పరిస్థితిపై అధికారులు ఎందుకు సానుకూలంగా స్పందించలేకపోయారు? అనే అంశాలపై ట్రాఫిక్ పోలీసుల పూర్తి వివరణ రావాల్సి ఉంది. ప్రస్తుతం వైరల్ వీడియోలో కనిపించిన దృశ్యాల ఆధారంగానే ఈ ఘటనపై చర్చ కొనసాగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!