

విజయవాడలో నేటి నుంచి జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు 14 రోజుల పాటు ఈ మేళా జరగనుంది. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీలోనే నిర్వహించిన జాతీయ సరస్ మేళాను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు.
డ్వాక్రా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం మొత్తం 650 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ‘స్వయం ఏపీ’ బ్రాండ్ పేరుతో మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. ఈ మేళా ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ లభించడంతో పాటు వారి ఆదాయం పెరిగేందుకు అవకాశాలు ఏర్పడనున్నాయి. మరోవైపు, విజయవాడలోని పున్నమి ఘాట్లో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలతో ఆత్మీయ విందులో పాల్గొననున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!