

వైద్య కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియలో కీలక మార్పులు తీసుకురావాలని పలు రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. కేవలం నీట్-యూజీ ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులనే కాకుండా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో విద్యార్థులు పొందిన మార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. అంతేకాకుండా ఏడాదికి ఒకసారి మాత్రమే కాకుండా ఒకటి కంటే ఎక్కువసార్లు నీట్ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని ప్రతిపాదించాయి. పరీక్షల నిర్వహణలో సంస్కరణలను పరిశీలిస్తున్న నందన్ నీలేకని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి ఈ సిఫార్సులు సమర్పించాయి. ఈ మార్పుల ద్వారా విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించడంతోపాటు వైద్య విద్యలో ప్రవేశాల ప్రక్రియను మరింత సరళతరం చేయవచ్చని రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి.
మరోవైపు, పరీక్షల సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యాసంస్థలు, విద్యా నిపుణులు, పరీక్షల నిర్వహణ సంస్థల నుంచి కమిటీకి దాదాపు 50 వేల సూచనలు అందాయి. ప్రవేశ పరీక్షల విధానంలో మార్పులు, మూల్యాంకన పద్ధతుల మెరుగుదల వంటి పలు అంశాలపై అభిప్రాయాలు సేకరించింది. వాస్తవానికి అక్టోబరులోనే కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉండగా, మరిన్ని అంశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం గడువును పొడిగించింది. కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో నీట్-యూజీ పరీక్ష నిర్వహణ, వైద్య కళాశాలల ప్రవేశాల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!