

అమెరికాలో ఉద్యోగం అంటే భారీ జీతాలు వస్తాయని భావిస్తుంటారు. అయితే అక్కడి జీవన వ్యయం కూడా అదే స్థాయిలో ఉంటుందని న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్, ఎంట్రప్రెన్యూర్ ఖుషీ జైన్ వివరించారు. ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరణ్ హెగ్డే తన అపార్ట్‌మెంట్‌లో వీడియో తీస్తున్న సమయంలో ఆమెను నెలవారీ అద్దె గురించి ప్రశ్నించగా.. తాము నెలకు 10 వేల డాలర్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.10 లక్షలకు సమానం. రెండు బెడ్‌రూమ్‌లు, రెండు బాత్‌రూమ్‌లతో కూడిన అపార్ట్‌మెంట్‌కు ఇంత భారీ అద్దె వింటూనే శరణ్ హెగ్డే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మ్యాన్‌హాటన్‌లో ఆధునిక సౌకర్యాలున్న ఇళ్లకు అద్దెలు భారీగా ఉంటాయని ఖుషీ జైన్ తెలిపారు. గతంలో ఇల్లు వెతికినప్పుడు రూ.10 లక్షల కంటే తక్కువకు తమకు నచ్చిన ఇల్లు దొరకకపోవడంతో మరో ప్రాంతానికి మారినట్లు చెప్పారు. బ్రూక్లిన్, క్వీన్స్ వంటి ప్రాంతాల్లో నెలకు సుమారు రూ.5–6 లక్షల మధ్య అద్దెకు ఇళ్లు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో న్యూయార్క్‌లో అద్దెలపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఇంతకంటే తక్కువకే ఇళ్లు దొరుకుతాయని చెప్పగా.. మరికొందరు అమెరికాలో ఆదాయాలు, జీవన వ్యయాలను రూపాయల్లోకి మార్చి మాత్రమే పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!