

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ పార్టీ ఎమ్మెల్యేల వరుస వివాదాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కొందరు ప్రజాప్రతినిధుల చుట్టూ వివాదాలు, ఆరోపణలు చోటుచేసుకోవడంతో అవి ప్రభుత్వ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతాయనే ఆందోళన పార్టీ నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 11న చెన్నైలో టీవీకే మంత్రులు, ఎమ్మెల్యేలతో విజయ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. సమావేశానికి ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ సమావేశంలో విజయ్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజలతో, ప్రభుత్వ అధికారులతో వ్యవహరించే సమయంలో బాధ్యతాయుతంగా ఉండాలని, పార్టీ క్రమశిక్షణను పాటించాలని హెచ్చరించే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ రవిశంకర్, కల్లకురిచ్చి ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్ తదితరుల చుట్టూ నెలకొన్న వివాదాలు ఈ భేటీకి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈ ఆరోపణలపై పార్టీ అంతర్గత విచారణలు చేపట్టి, అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. టీవీకే ఎమ్మెల్యేల వ్యవహారశైలి ప్రస్తుతం తమిళనాట రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!