

చేతుల్లో తుపాకులు పట్టుకోరు.. యుద్ధ ట్యాంకులను నడపరు. కంప్యూటర్ల ముందు కూర్చొని ప్రపంచ దేశాల బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లను లక్ష్యంగా చేసుకుంటారు. వారే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాలనలో అభివృద్ధి చేసినట్లు భావిస్తున్న రహస్య సైబర్ బృందాలు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు భారీ సైబర్ దాడులు, క్రిప్టో కరెన్సీ చోరీల వెనుక ఉత్తర కొరియా హ్యాకింగ్ గ్రూపుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బైనాన్స్ నుంచి 6 బిలియన్ డాలర్లు చోరీకి గురయ్యాయన్న ప్రచారం కూడా ఈ ముప్పుపై మరోసారి చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, చోరీ మొత్తం స్వతంత్రంగా నిర్ధారణ కావాల్సి ఉంది. అందుబాటులో ఉన్న కథనాల ప్రకారం.. ఉత్తర కొరియా ప్రభుత్వం చిన్న వయసులోనే చదువులో ప్రతిభ చూపే పిల్లలను ఎంపిక చేసి, ప్రత్యేక విద్యాసంస్థల్లో కోడింగ్, ప్రోగ్రామింగ్, సైబర్ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.
ఈ శిక్షణ సాధారణ విద్యకు భిన్నంగా కఠినమైన నియమాలతో సాగుతుందని, శిక్షణ పొందేవారిని బయటి ప్రపంచానికి దూరంగా ఉంచుతారని కథనాలు పేర్కొంటున్నాయి. తొలుత చిన్నస్థాయి ఆన్‌లైన్ వేదికలను లక్ష్యంగా చేసుకోవడం నేర్పించి, ఆ తర్వాత విదేశీ బ్యాంకులు, ప్రభుత్వ నెట్‌వర్క్‌లు, క్రిప్టో సంస్థలపై దాడులకు సిద్ధం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాయిటర్స్ నివేదికను ఉటంకిస్తూ వచ్చిన సమాచారం ప్రకారం.. ఉత్తర కొరియా సైబర్ బృందాల్లో సుమారు 8,000 మంది ఉండవచ్చని అంచనా. 2024లో ఈ సంఖ్య దాదాపు 6,000గా ఉన్నట్లు పేర్కొన్నారు. భారీ సైబర్ దాడుల్లో విజయం సాధించిన వారికి ప్యాంగ్యాంగ్‌లో విలాసవంతమైన ఇళ్లు వంటి బహుమతులు అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో సైబర్ నేరాల ద్వారా సంపాదించిన నిధులను దేశ అవసరాలకు, ఆయుధ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఉత్తర కొరియా సైబర్ కార్యకలాపాలు ప్రపంచ దేశాలకు, ఆర్థిక సంస్థలకు తీవ్ర సవాలుగా మారుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!