

బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హరిచంద్ జాట్ అలియాస్ హ్యారీ బాక్సర్‌ను కాలిఫోర్నియాలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ పోలీసులు, హరియాణా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అందించిన సమాచారంతో ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని బన్‌సూర్ ప్రాంతానికి చెందిన హ్యారీ బాక్సర్ గతంలో జైపుర్‌లో బాక్సింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్‌లో చేరి విదేశాల నుంచి వసూళ్ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హత్య, హత్యాయత్నం, దాడులు, కాల్పులు, వసూళ్లకు సంబంధించిన పలు కేసులు అతడిపై ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద జరిగిన కాల్పులకు తానే బాధ్యుడినని హ్యారీ బాక్సర్ సోషల్ మీడియాలో ప్రకటించుకున్నట్లు అధికారులు తెలిపారు. రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపు ఆడియోలు, సందేశాలు పంపినట్లు ఆరోపణలున్నాయి. టైగర్ ష్రాఫ్‌పై ఇటీవల జరిగిన కాల్పుల ఘటనకు ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రణదీప్ మాలిక్ నెట్‌వర్క్‌తోనూ అతడికి సంబంధాలున్నాయని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. హ్యారీ బాక్సర్, అనిల్ పండిట్ రణదీప్ మాలిక్ గ్యాంగ్‌లో భాగమని, ఎన్‌క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా ఆదేశాలు అందుకుని పనిచేసేవారని డీసీపీ ప్రవీణ్ త్రిపాఠి వెల్లడించారు. నిందితుడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు సీబీఐ చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!