

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలకు దిగినట్లు సమాచారం. దేశంలోని అణు కేంద్రాలకు సమీపంలో నివసిస్తున్న ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లను పంపిణీ చేస్తోంది. అణు కేంద్రాల చుట్టూ 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి ఈ మాత్రలు అందిస్తున్నట్లు ఓ ఇరాన్ అధికారి వెల్లడించారు. అణు ప్రమాదాలు జరిగినప్పుడు వెలువడే రేడియోధార్మిక అయోడిన్ ప్రభావం నుంచి థైరాయిడ్ గ్రంథిని కొంతవరకు రక్షించేందుకు పొటాషియం అయోడైడ్ మాత్రలు ఉపయోగపడతాయి. రేడియేషన్ ప్రభావం వల్ల థైరాయిడ్ కణాలు దెబ్బతినడంతో పాటు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు కూడా పెరిగే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నమ్మలేమని, అణు కేంద్రాలపై దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇరాన్ అధికారి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
మరోవైపు, ఇరాన్‌పై సైనిక చర్యలను కొనసాగించాలా వద్దా అనే అంశంపై ట్రంప్ ఇటీవల తన జాతీయ భద్రతా బృందంతో చర్చించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇరాన్‌లోని పికాక్స్ మౌంటైన్ ప్రాంతంలో ఉన్న అణు కేంద్రంపై దాడి జరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అందించే వారికి అమెరికా తన 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' కార్యక్రమం కింద 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.188 కోట్లు) బహుమతిగా ప్రకటించినట్లు సమాచారం. అణు కేంద్రాలు, పరికరాలు, శాస్త్రవేత్తలు, సిబ్బందికి సంబంధించిన వివరాలు అందించాలని కోరింది. మరోవైపు, ఇరాన్‌పై పరిమిత స్థాయిలో దాడులు నిర్వహించి, ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఖేష్మ్ ద్వీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ భయాలు మరింత పెరిగాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!